Andhra Pradesh: సీఎం జగన్ మందలించారంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్!
- గుంటూరు తాడికొండ వైసీపీలో కుమ్ములాటలు
- ఎమ్మెల్యే శ్రీదేవి-ఎంపీ నందిగం సురేష్ ల మధ్య ఆధిపత్య పోరు
- సీఎం జగన్ కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని వార్తలు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు నందిగం సురేష్, ఉండవల్లి శ్రీదేవిల మధ్య ఆధిపత్య పోరు నెలకొన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తన నియోజకవర్గమైన తాడికొండలో లోక్ సభ సభ్యుడు నందిగం సురేష్ జోక్యం చేసుకోవడంపై ఆమె గుర్రుగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి.
నందిగం సురేష్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు తాడికొండలో ప్లెక్సీలు కట్టగా, వారిని ఎమ్మెల్యే శ్రీదేవి మందలించారని సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరి పంచాయితీ వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు చేరింది. తాజాగా ఈ వివాదంపై నందిగం సురేష్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తమిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ, ఎన్నికల ముందురోజు కూడా తాము కలుసుకుని మాట్లాడుకున్నామని తెలిపారు.
ఎన్నికల సందర్భంగా శ్రీదేవికి ఓటేశాకే తాను బాపట్ల వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించానని వ్యాఖ్యానించారు. కొంతమంది పార్టీలో తమ మధ్య అభిప్రాయభేదాలు సృష్టించేందుకే ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైఎస్సార్ పార్టీ అనీ, జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబమని స్పష్టం చేశారు. తమ పార్టీ పిల్లలు ఇద్దరు గొడవపడితే దాన్ని పెద్ద వివాదంగా చూపిస్తున్నారని చెప్పారు.
ఆ ఇద్దరు పిల్లలకు తాను సర్దిచెప్పానని అన్నారు. సీఎం జగన్ తనను మందలించలేదనీ, శ్రీదేవి గారు తనపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. టీవీలో స్క్రోలింగ్ చూశాక తాను శ్రీదేవి గారిని కలిసి మాట్లాడానని తెలిపారు. ఈ విషయం మరింత వివాదం కాకూడదన్న ఉద్దేశంతోనే తాము క్లారిటీ ఇస్తున్నామని చెప్పారు. తమకు రాజకీయ భిక్ష పెట్టిందని జగన్ మోహన్ రెడ్డేనని నందిగం సురేష్ పేర్కొన్నారు.