MS Dhoni: ధోనీ ఓ సిరీస్ లో సెహ్వాగ్, సచిన్ లతో పాటు నన్నూ పక్కనబెట్టాలనుకున్నాడు: గంభీర్
- ధోనీ రిటైర్మెంటు అంశంపై స్పందించిన గంభీర్
- ధోనీ భావోద్వేగాలకు లోనవ్వకుండా నిర్ణయం తీసుకోవాలని సలహా
- యువ వికెట్ కీపర్ లకు వంతుల వారీగా చాన్సులివ్వాలంటూ సూచన
టీమిండియా మాజీ ఓపెనర్, లోక్ సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్ ధోనీ వ్యవహారంపై స్పందించాడు. ధోనీ కెప్టెన్ గా వ్యవహరించిన సమయంలో కుర్రాళ్లకు ఎక్కువగా చాన్సులు ఇచ్చేవాడని తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ సిరీస్ లో సెహ్వాగ్, సచిన్ లతో పాటు తనను కూడా పక్కనబెట్టాలనుకున్నాడని గంభీర్ వెల్లడించాడు. యువ ఆటగాళ్ల కోసమే ధోనీ ఆ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు. అయితే, ఇప్పుడు ధోనీ తన కెరీర్ చరమాంకంలో ఉన్నాడని, ప్రస్తుత పరిస్థితిపై ఉద్వేగానికి లోనవ్వకుండా తన కెరీర్ పై ధోనీ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.
తదుపరి వరల్డ్ కప్ కోసం నికార్సయిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ను రూపుదిద్దడానికి ఇదే సరైన తరుణమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. భావి వికెట్ కీపర్ గా తన దృష్టిలో రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఉన్నారని, వారికి విడివిడిగా అవకాశాలిచ్చి పరీక్షించాలని సూచించాడు. ఒక్కొక్కరికి ఒకటిన్నర ఏడాది పాటు చాన్సులు ఇచ్చి చూడాడలని చెప్పాడు.