Venkaiah Naidu: మరోసారి ఇలా జరిగితే బాగుండదు... రాజ్యసభలో మంత్రికి వార్నింగ్ ఇచ్చిన వెంకయ్యనాయుడు
- ఉభయసభలకు డుమ్మా కొడుతున్న సభ్యులు, మంత్రులపై ప్రధాని కన్నెర్ర
- గైర్హాజరవుతున్న సభ్యుల పేర్లు తనకు పంపాలంటూ సభాధ్యక్షులకు సూచన
- వెంకయ్యనాయుడికి దొరికిపోయిన కేంద్ర సహాయమంత్రి
ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు స్వీకరించాక సొంత క్యాబినెట్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు ఉభయసభలకు గైర్హాజరయ్యే సభ్యులపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ముఖ్యంగా, మంత్రులెవరైనా సభకు గైర్హాజరైతే వారిపేర్లను ప్రతిరోజు సాయంత్రం తనకు పంపాలంటూ లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ లకు సూచించారు. ఈ క్రమంలో, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఓ మంత్రివర్యులు దొరికిపోయారు.
కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ ఇటీవల తరచుగా రాజ్యసభకు డుమ్మా కొడుతుండడం పట్ల వెంకయ్యనాయుడు నిలదీశారు. మరోసారి ఇలాంటి క్రమశిక్షణ రాహిత్యం పునరావృతం అయితే సహించలేదని లేదని హెచ్చరించారు.
"మంత్రి గారూ, మొన్నటి సభలో అజెండాలో మీ పేరు ఉంది కానీ మీరు మాత్రం లేరు. మీ పేరు పిలిచాం, కానీ మీరు సభలో లేరు. దయచేసి గుర్తుంచుకోండి, మరోసారి ఇలా జరగకూడదు" అంటూ స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడి ఆగ్రహానికి గురైన మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ జరిగినదానికి చింతిస్తున్నట్టు తెలిపారు. తాను సభకు గైర్హాజరైంది నిజమేనని, ఇలాంటి తప్పు మరోసారి జరగదని చెప్పారు.