Donald Trump: బంగ్లాదేశ్ ఎక్కడుందన్న ట్రంప్... బర్మా పక్కనే ఉంటుందని చెప్పిన సలహాదారు!

  • శరణార్థుల కార్యక్రమంలో ట్రంప్ అవగాహన లేమి!
  • నోబెల్ గ్రహీతతో అసందర్భోచిత వ్యాఖ్యలు
  • ఆశ్చర్యపోయిన ప్రతినిధులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచ భౌగోళిక పరిస్థితులపై పెద్దగా అవగాహనలేదన్న విషయం వెల్లడైంది. ఓ కార్యక్రమంలో "బంగ్లాదేశ్ ఎక్కడ ఉంటుంది?" అని ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చివరికి ఆయన వ్యక్తిగత సలహాదారు బంగ్లాదేశ్ ఎక్కడ ఉంటుందో చెప్పడంతో తల ఊపారు. ఇరాకీ యాజిదీలు, మయన్మార్ రోహింగ్యాల సమస్యలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ కూడా పాల్గొన్నారు.

ఓ రోహింగ్యా ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను బంగ్లాదేశ్ శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్న రోహింగ్యానని చెబుతుండగా, ఇంతకీ బంగ్లాదేశ్ ఎక్కడుంది? అంటూ ట్రంప్ ప్రశ్నించారు. దాంతో ఆయన వ్యక్తిగత సలహాదారు ముందుకొచ్చి, బర్మా (మయన్మార్) పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది అని తెలిపారు. ట్రంప్ తల పంకిస్తూ మరో శరణార్థి ప్రతినిధి వైపు దృష్టి సారించారు.

యాజిదీల ప్రతినిధిగా వచ్చిన నోబెల్ పురస్కార గ్రహీత నదియా మురాద్ తో మాట్లాడుతూ తనదైన శైలిలో స్పందించారు. ఇరాక్ లోని యాజిదీలను ఐఎస్ఐఎస్ ఉగ్రమూకలు వేల సంఖ్యలో అపహరిస్తున్నాయని, అపహరణకు గురైనవారిలో తాను ఉన్నానని మురాద్ వివరిస్తుండగా, ట్రంప్ మధ్యలో అందుకుని, మీరు నోబెల్ గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. ఇంతకీ మీకు నోబెల్ ప్రైజ్ ఎందుకిచ్చారంటూ అసందర్భ ప్రశ్నలు సంధించారు.

ట్రంప్ వైఖరితో విస్తుపోయిన మురాద్, తనకు నోబెల్ రావడానికి గల కారణాలు వివరించి, మరలా యాజిదీల సమస్యల్ని ఏకరవు పెట్టారు. ఇది తన ఒక్క కుటుంబ సమస్య కాదని, అమెరికా ఏదైనా చర్య తీసుకోవాలని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News