Karnataka: నన్ను చంపాలనుకుంటున్నారా?: నిప్పులు చెరిగిన కర్ణాటక స్పీకర్
- నేను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చా
- నాపై నోటికొచ్చినట్టు విమర్శలు గుప్పిస్తున్నారు
- భావి తరాలు మనల్ని అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది
జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి కావాలనే ప్రాణం పోశానని కొందరు నాయకులు తనపై ఆరోపణలు చేస్తున్నారని కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని... తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయన తెలిపారు. తాను విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పారు. బలపరీక్షపై కావాలనే తాను జాప్యం చేస్తున్నానని కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. తనపై బురద చల్లుతున్నారని భావోద్వేగానికి గురయ్యారు.
తన తల్లిదండ్రులు తనకు సంస్కారాన్ని నేర్పారని రమేశ్ కుమార్ చెప్పారు. తనపై నోటికొచ్చినట్టు విమర్శలు గుప్పిస్తున్నవారు... కడుపుకు ఏం తింటున్నారో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గౌరవ మర్యాదలతో తాను బతుకుతున్నానని... తనను బోనులో నిలబెట్టి చంపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో వ్యాపార వ్యవహారాల గురించి చర్చ జరపాల్సిన పరిస్థితి రావడం బాధాకరంగా ఉందని అన్నారు. మహామహులు కూర్చున్న ఈ సభలో... నేడు ఇలాంటి దరిద్రం ఆవహించడం దురదృష్టకరమని చెప్పారు.
బేరసారాలపై సభలో పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం సిగ్గుపడే విషయమని రమేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అంశం రికార్డుల్లో ఉంటుందని... భావి తరాలు వీటిని చూసి, మనల్ని అసహ్యించుకునే పరిస్థితి వస్తుందని చెప్పారు. అసెంబ్లీలో బలపరీక్ష తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు సభలో నిశ్శబ్దం ఆవరించింది.