Chittoor District: మాకో టీచర్ కావాలి సారూ...రోడ్డుపై బైఠాయించి చిన్నారుల నిరసన
- ఏకోపాధ్యాయునితో సరిగా సాగని చదువు
- ఎమ్మెల్యే దృష్టికి సమస్య తీసుకువెళ్లిన తల్లిదండ్రులు
- తక్షణం చర్యలకు ఆయన ఆదేశించినా పట్టని అధికారులు
ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో చదువు సక్రమంగా సాగడం లేదని, తమకు మరో టీచర్ కావాలంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె-మదనపల్లె రహదారిపై కూర్చుని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం మేరకు...నిమ్మనపల్లె మండం ముష్టూరు పంచాయతీ దిగువపల్లె ప్రాథమిక పాఠశాలలో మొత్తం 60 మంది విద్యార్థులు చదువుతుండగా ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు.
అన్ని క్లాసులను ఏకోపాధ్యాయుడు డీల్ చేయడం కష్టమవుతుండడమేకాక, ఆయన సెలవు పెడితే ఏకంగా పాఠశాలకే సెలవు ప్రకటించాల్సి వస్తోంది. దీంతో తమ పిల్లల చదువు సరిగా సాగడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల నిమ్మనపల్లె పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే నవాజ్‌భాషాకు వినతిపత్రం అందించారు. ఆయన వెంటనే స్పందించి మరో ఉపాధ్యాయుడిని నియమించాలని అధికారులను ఆదేశించినా పని జరగలేదు. దీంతో ఆవేదనతోనే రోడ్డెక్కాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. విద్యార్థుల నిరసన కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.