Eoin Morgan: వరల్డ్ కప్ విజయంపై ఇంగ్లాండ్ కెప్టెన్ అసంతృప్తి
- బౌండరీల నిబంధనపై మోర్గాన్ స్పందన
- గెలుపును సరైన రీతిలో ఆస్వాదించలేకపోతున్నామంటూ వ్యాఖ్యలు
- కేన్ విలియమ్సన్ కు సానుభూతి తెలిపిన వైనం
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన వరల్డ్ కప్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ జట్టుతో రోమాంఛక రీతిలో సాగిన ఫైనల్లో అత్యధిక బౌండరీల నిబంధనతో ఇంగ్లాండ్ గట్టెక్కింది. నిబంధనల ప్రకారం వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండే అయినా, చివరివరకు పట్టువిడవకుండా పోరాడిన న్యూజిలాండ్ కూడా అందరి మనసులు దోచుకుంది. దీనిపై స్వయానా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా స్పందించాడు.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫలితం చాలా కఠినంగా అనిపించిందని తెలిపాడు. హోరాహోరీ మ్యాచ్ లో విజేతను ఈ విధంగా నిర్ణయించడం సబబుగా అనిపించలేదని పేర్కొన్నాడు. ఓ మ్యాచ్ లో రెండు జట్ల స్కోర్లు సమం అయినప్పుడు బౌండరీలు మ్యాచ్ విజేతను నిర్ణయించడం సమంజసం కాదనుకుంటున్నానని మోర్గాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇలా గెలవడాన్ని తాము సరైన రీతిలో ఆస్వాదించలేకపోతున్నామని, అదే సమయంలో ఈవిధంగా ఓడిపోవడాన్ని ఎవరూ తట్టుకోలేరని కూడా వివరించాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో కూడా ఇదే విషయాన్ని చర్చించానని మోర్గాన్ వెల్లడించాడు.