RGV: హెల్మెట్ లేకుండా వర్మ ప్రయాణించిన బండికి చలాన్ రాసిన పోలీసులు
- శిష్యులతో కలిసి ట్రిపుల్ రైడింగ్ చేసిన వర్మ
- పోలీసులు ఎక్కడున్నారంటూ ట్వీట్ చేసిన వైనం
- చలాన్ తో రిప్లయ్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాదులో ఇవాళ ఓ సాధారణ వ్యక్తిలా ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసేందుకు మోటార్ సైకిల్ పై థియేటర్ కి వచ్చారు. తన శిష్యులు అజయ్ భూపతి, అగస్త్యలతో కలిసి రాయల్ ఎన్ ఫీల్డ్ పై మూసాపేట శ్రీరాములు థియేటర్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా బండి మీద ఉన్న ముగ్గురిలో ఎవరికీ హెల్మెట్ లేదు, పైగా ట్రిపుల్ రైడింగ్!
దీనిపై వర్మ కూడా స్పందిస్తూ, 'హెల్మెట్ లేకుండానే వెళుతున్నాం, ఇంతకీ పోలీసులు ఎక్కడ? బహుశా వాళ్లు కూడా థియేటర్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా చూస్తున్నారనుకుంటా' అంటూ ట్వీట్ చేశారు. కానీ, చట్టం తన పని తాను చేసుకుపోయింది. వర్మ తదితరులు ప్రయాణించిన బండి బద్దె దిలీప్ కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్టు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు బండి యజమానికి చలాన్ పంపారు. హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్ కారణాలుగా చూపుతూ రూ.1300 జరిమానా వడ్డించారు.