Andhra Pradesh: వార్డు సచివాలయ నియామకాల కోసం ఈ నెల 22న నోటిఫికేషన్
- ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 వరకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు
- అక్టోబరు 2 నుంచి వార్డు సచివాలయ సేవలు
- రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు ఆదేశాలు
జగన్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వార్డు సచివాలయాల ఏర్పాటులో కీలక ముందడుగు పడుతోంది. ఈ నెల 22న వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 వరకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు జరపనున్నారు. అక్టోబరు 2 నుంచి వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ యోచన. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు.
అంతేగాకుండా, పట్టణాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటుకు విధివిధానాలు రూపొందించారు. రాష్ట్రం మొత్తమ్మీద 3775 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రతి 4 వేల మంది జనాభాకు ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయం ద్వారా లబ్దిదారులందరికీ నేరుగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వార్డు సచివాలయాలను వార్డు కార్యాలయాల్లోనూ, అంగన్ వాడీ భవనాల్లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.