Smartphone: టీనేజ్ కొడుక్కి తన ఫోన్ ఇచ్చిన తండ్రి.. అక్రమ భాగోతం బట్టబయలు!
- ఫోన్ లో మరో మహిళతో సరస సంభాషణలు సాగించిన తండ్రి
- పొరబాటున ఆడియో రికార్డర్ ఆన్ చేసిన బాలుడు
- ఆడియోల విషయం తల్లికి చెప్పిన వైనం
బెంగళూరులో ఓ అక్రమ సంబంధం ఆశ్చర్యకరమైన రీతిలో బట్టబయలైంది. నగరానికి చెందిన 43 ఏళ్ల నాగరాజన్ ఓ స్వచ్ఛంద సేవా సంస్థ యజమాని. నాగరాజన్ భార్య స్థానికంగా ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. వారికి 14 ఏళ్ల టీనేజ్ కుమారుడు ఉన్నాడు. అయితే ఒకరోజు నాగరాజన్ తన ఫోన్ ను కొడుకు అడగడంతో ఇచ్చాడు. ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతున్న ఆ కుర్రాడు పొరబాటున ఆడియో రికార్డర్ ఆన్ చేశాడు. అందులో రికార్డయిన కొన్ని ఆడియోలు ఆ టీనేజ్ బాలుడ్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
తన తండ్రి, మరో మహిళతో అత్యంత సన్నిహితంగా మాట్లాడిన మాటలు అందులో రికార్డయి ఉన్నాయి. వాట్సాప్ చాటింగ్ లోనూ కొన్ని సంభాషణలు బయటపడ్డాయి. ఈ కుర్రాడు వెంటనే వాటిని తన తల్లికి చూపించాడు. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆ ఇల్లాలు తెలుసుకుంది. భర్తను నిలదీయడంతో, ఆమెను తీవ్రంగా కొట్టాడు.
ఈ నేపథ్యంలో, ఆ స్కూల్ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్రమ వ్యవహారం గురించి కుటుంబ సభ్యులకు చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, స్టేషన్ బయటే రాజీచేసుకునేందుకు నాగరాజన్ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.