Telugudesam: జగన్ వ్యాఖ్యలతో భయపడుతున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు!
- పార్టీ మారాలంటే రాజీనామా చేయాల్సిందే
- లేకుంటే అనర్హత వేటు వేయండి
- స్పీకర్ సీతారాంకు జగన్ వినతి
- బీజేపీలో చేరేందుకు భయపడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించేలా లేవు. ఇప్పటికే నలుగురు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల్ని తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ, ఇప్పుడు టీడీపీ తరఫున గెలిచిన 23 మందిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుండగా, సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు భయపడుతున్నారు. ఎవరు పార్టీ మారినా, తొలుత పదవికి రాజీనామా చేసి వెళ్లాలని, రాజీనామా చేయకుంటే, వారు ఎమ్మెల్యే పదవికి అనర్హులని ప్రకటించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను జగన్ స్పష్టంగా కోరడమే ఇందుకు కారణం.
తొలి నుంచి పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్న జగన్, స్పీకర్ కు చేసిన సూచనలతో, ఎక్కడ తమపై అనర్హత వేటు పడి, ఎమ్మెల్యే పదవిని కోల్పోతామోనని భావిస్తున్న ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావడం లేదని బీజేపీ భావిస్తోంది. దీంతో ఆ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ చర్యలును తీవ్రంగా విమర్శిస్తోంది. జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు పూర్తి కాకముందే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, సోము వీర్రాజు, తదితరులు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన అరాచకంగా మారిందని, ప్రజావేదిక కూల్చివేత తొందరపాటు చర్యని అంటున్నారు.
జగన్ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని పురందేశ్వరి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో చిచ్చురేపడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు గుప్పించారు. ఏబీవీపీ విద్యార్థులను క్రిమినల్స్ లా చూస్తున్నారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయమేన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని అంటున్నారు. అగ్రకుల హిందూ యువతులను పెళ్లి చేసుకుంటే, దళిత క్రైస్తవులకు లక్ష రూపాయలు నజరానా ఇస్తామని వైసీపీకి చెందిన వారు ‘మహాసేన’ పేరిట వీడియోలను ప్రచారం చేస్తున్నా, పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.