Prashant Kishore: మమతా బెనర్జీతో చేతులు కలిపిన ప్రశాంత్ కిశోర్... ఇక తృణమూల్ కు సేవలు!

  • ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ 
  • 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
  • తృణమూల్ విజయానికి కృషి చేయనున్న పీకే

ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్, తృణమూల్ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయనున్నారు. ప్రశాంత్ తో ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ డీల్ ను కుదుర్చుకోగా, 2021లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ విజయం సాధించేందుకు పీకే తనదైన వ్యూహాలను రచించనున్నారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, ప్రజల నాడిని అర్థం చేసుకునేందుకు ఆయన ప్రత్యేకంగా పర్యటించనున్నారు.

నేడు తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలో అమరవీరుల ర్యాలీ కోల్ కతాలో జరుగనుండగా, ప్రశాంత్ కిశోర్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ర్యాలీ అనంతరం కొన్ని రోజుల పాటు ఆయన కోల్ కతాలోనే మకాంవేసి, ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకుని, కొన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తారని తెలుస్తోంది. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ విజయం సాధించడానికి, ఆపై బీహార్ లో నితీశ్, లాలూల నేతృత్వంలోని మహా కూటమి విజయం సాధించడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు సహకరించాయన్న సంగతి తెలిసిందే. ఆపై ఆయన ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో డీల్ కుదుర్చుకుని, రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధించేందుకు తనవంతు కృషి చేశారు. దీంతో ఆయన సేవలకు డిమాండ్ ఏర్పడింది.

తాజాగా, ఆయన పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ఆయన సేవలను తాము కూడా పొందాలని తమిళనాడులోని డీఎంకే భావిస్తుండగా, దీనిపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. తమిళనాడులో కూడా 2021లోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో, ఒకేసారి రెండు రాష్ట్రాలకూ ప్రశాంత్ కిశోర్ సేవలందిస్తారా? అన్న విషయంపై ఆయన ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News