Andhra Pradesh: జగన్ ను విమర్శిస్తే స్వీడన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి!: టీడీపీ నేత జవహర్
- ఏపీలో అభివృద్ధి 60 ఏళ్లు వెనక్కి వెళ్లింది
- తనవారికి కాంట్రాక్టులు అప్పగించేందుకు జగన్ ప్రయత్నం
- కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత
ఏపీలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులన్నీ తన అనుయాయులకు కట్టబెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ విమర్శించారు. జగన్ రెండు నెలల పాలన కాలంలో రాష్ట్రం 60 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఆశావర్కర్లకు టీడీపీ ప్రభుత్వం రూ.8,600 వేతనం ఇచ్చిందనీ, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రూ.10 వేలు ఇస్తామని చెప్పడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. కృష్ణా జిల్లాలోని చండ్రుపట్లలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ పరిపాలనపై తాను మాట్లాడితే స్పీడన్, తదితర దేశాల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని జవహర్ ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతానని వ్యాఖ్యాానించారు. ఈవీఎంల తీరుపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. తమంతా టీడీపీకే ఓటేశామనీ, ఎలా ఓడిపోయారంటూ ప్రజలు చంద్రబాబు వద్ద వాపోతున్నారని చెప్పారు. ఈవీఎంల పరితీరుపై తమకు అనుమానం ఉందన్నారు.