Kerala: కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం
- భారీ వర్షాలకు నలుగురు మృతి
- ముగ్గురు గల్లంతు
- పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటన
కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కేరళలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. వర్షాల కారణంగా కేరళలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరు తమిళనాడు మత్స్యకారులు కూడా ఉన్నారు. ఇడుక్కి, కాసరగోడ్, కోజికోడ్, కణ్ణూర్ జిల్లాల్లో ఈ నెల 23 వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 25 వరకు కేరళలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) చెబుతోంది. మరోవైపు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికార వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి.