MS Dhoni: మిలిటరీలో శిక్షణ కోసం కశ్మీర్ లోయలోకి వెళ్లిపోయిన ఎంఎస్ ధోనీ!
- విండీస్ పర్యటనకు వెళ్లరాదని నిర్ణయం
- సైన్యంలో శిక్షణ కావాలని వినతి
- ఓకే చెప్పిన బిపిన్ రావత్
- ప్యారాచూట్ రెజిమెంట్ లో రెండు నెలలు
విండీస్ పర్యటనకు వెళ్లరాదని నిర్ణయించుకుని, రెండు నెలల పాటు తాను గౌరవ ఉద్యోగం చేస్తున్న పారామిలిటరీ రెజిమెంట్ లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్న భారత స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ, కశ్మీర్ లోయలోకి వెళ్లిపోయారు. తాను విండీస్ పర్యటనకు వెళ్లబోనని, రెండు నెలలు పారా మిలిటరీ రెజిమెంట్ లో పని చేయాలని భావిస్తున్నానని ధోనీ లేఖ రాయగా, దానికి భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అంగీకరించిన సంగతి తెలిసిందే.
ఆయన ఓకే చెప్పగానే, ధోనీ మిలిటరీ కేంద్రానికి వెళ్లిపోయారు. అక్కడ ధోనీకి వెల్ కమ్ పలికిన అధికారులు, కశ్మీర్ లోయలో ప్యారాచూట్ రెజిమెంట్ బెటాలియన్ లో ధోనీకి డ్యూటీలు వేశారు. ధోనీకి రెండు నెలల పాటు అక్కడే శిక్షణ ఉంటుంది. అయితే, అతను ఎటువంటి సైనిక చర్యల్లో భాగం కాలేడని, శిక్షణ తీసుకుని, తన శక్తి సామర్ణ్యాలను మెరుగుపరచుకుంటారని ఈ సందర్భంగా సైన్యాధికారి ఒకరు తెలిపారు.