soyam bapurao: నాటిన మొక్కలు పీకేయండి.. అటవీ అధికారులను చావగొట్టండి: గిరిజనులను రెచ్చగొట్టిన ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ
- పోడు భూముల్లో మొక్కలు నాటితే తిరగబడండి
- అవసరం అనుకుంటే అటవీ అధికారులపై దాడి చేయండి
- ఏం జరుగుతుందో నేను చూస్తా
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవసరమనుకుంటే అటవీ అధికారులపై దాడి చేయాలని గిరిజనులకు సూచించారు. పోడు భూముల్లో మొక్కలు నాటకుండా అటవీ అధికారులను అడ్డుకోవాలని, నాటిన వాటిని పీకేయాలని పిలుపునిచ్చారు. అవసరం అనుకుంటే అధికారులపై దాడిచేయాలని సూచించారు. ‘‘అటవీ అధికారులు మీ వద్దకు వచ్చి మీ పోడు భూములను లాక్కుని మొక్కలు నాటాలని ప్రయత్నిస్తే తిరగబడండి. నాటిన మొక్కలను పీకేయండి. అవసరం అనుకుంటే చావబాదండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చూస్తా’’ అని గిరిజనులను రెచ్చగొట్టారు. గిరిజనుల హక్కుల కోసం తాను పోరాడతానని, వారు భయపడాల్సిందేమీ లేదని అభయమిచ్చారు.
తుడుందెబ్బ వ్యవస్థాపకుడు సిద్దం శంబు వర్ధంతి కార్యక్రమానికి హాజరైన బాపూరావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ అధికారిణి అనితపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ దాడి చేసి తీవ్రంగా దాడిచేసిన ఘటన మరువకముందే బాపూరావు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.