Rahul Gandhi: గాంధీల నాయకత్వం లేకపోతే కాంగ్రెస్ 24 గంటల్లో కుక్కలు చింపిన విస్తరి అవుతుంది: నట్వర్ సింగ్
- గాంధీ కుటుంబం వ్యక్తే పార్టీ బాధ్యతలను స్వీకరించాలి
- ప్రియాంకలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి
- 134 ఏళ్ల చరిత్ర గల పార్టీకి అధ్యక్షుడు లేకపోవడం దురదృష్టకరం
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల పార్టీ పగ్గాలను స్వీకరించడానికి సోనియాగాంధీ కూడా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో, ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేక ఆ పార్టీ ఇబ్బందులు పడుతోంది. ప్రియాంకగాంధీకి పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు పార్టీలో వినపడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కూడా చేరారు. ప్రియాంకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని ఆయన అన్నారు. గాంధీల నాయకత్వం లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుతుందని... 24 గంటల్లో ముక్కలుముక్కలు అవుతుందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లోని సోనభద్రలో చనిపోయిన వారి కుటుంబీకులను ప్రియాంక కలవడం, వారిలో ధైర్యాన్ని నింపడాన్ని నట్వర్ సింగ్ ప్రశంసించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఆమె పట్టువీడకుండా, అక్కడే ఉండి, వారిని పరామర్శించడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. ఏం చేయాలనుకున్నారో అది చేసేంత వరకు ఆమె పట్టు వీడలేదని అన్నారు. ఇది ఆమె నాయకత్వ లక్షణాలను సూచిస్తోందని చెప్పారు. గాంధీల కుటుంబం నుంచి కాకుండా, బయటి వ్యక్తిని పార్టీ అధినేతగా చేయాలన్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ వెనక్కి తీసుకోవాలని సూచించారు.
134 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు లేకపోవడం దురదృష్టకరమని నట్వర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎవరో ఒకరు పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని కోరారు.