Andhra Pradesh: ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిపోవడానికి పూర్తి కారకులు వైసీపీ నేతలే: చంద్రబాబు
- నాడు భూములు ఇవ్వొద్దని వైసీపీ నేతలు రెచ్చగొట్టారు
- దుష్ప్రచారం చేస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారు
- ఏపీకి తీరని అన్యాయం చేశారు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిపోవడానికి పూర్తి కారకులు వైసీపీ నేతలే అని విమర్శించారు. నాడు రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వొద్దని వైసీపీ నేతలు రెచ్చగొట్టినా తొంభై తొమ్మిది శాతం మంది ఇచ్చారని అన్నారు. పర్యావరణం, ఆర్థిక, సామాజిక రంగాలపై ప్రభావం ఉంటుందంటూ దుష్ప్రచారం చేస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసింది వైసీపీ నేతలేనని విమర్శించారు.
వైసీపీపై ఉన్న అవినీతి ముద్రను టీడీపీపై రుద్దే యత్నం చేశారని, ఈ క్రమంలో ఏపీకి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అమరావతిలో ముళ్ల కంపలు తప్ప ఇంకేం లేవని మంత్రులే చెప్పడం దారుణమని, వైసీపీ కారణంగా అమరావతిలో భూముల విలువ బాగా పడిపోయిందని విమర్శించారు.