Karnataka: కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం... వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభ
- ఓటింగ్ నిర్వహించాలంటూ బీజేపీ పట్టు
- చర్చ పూర్తికావాల్సిందేనన్న స్పీకర్ రమేశ్ కుమార్
- బిగ్గరగా నినాదాలు చేసిన అధికార కూటమి సభ్యులు
కర్ణాటక రాజకీయ కల్లోలానికి ఇంకా అడ్డుకట్ట పడలేదు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. కర్ణాటక అసెంబ్లీలో గతకొన్నిరోజులుగా విశ్వాసపరీక్షపై జరుగుతున్న చర్చ కొనసాగుతోంది. సభలో ఇంకా 15 మంది ఎమ్మెల్యేలతో పాటు కీలక నేత సిద్ధరామయ్య కూడా చర్చలో భాగంగా మాట్లాడాల్సి ఉంది. అయితే, ఓటింగ్ నిర్వహించాల్సిందేనంటూ బీజేపీ పట్టుబట్టగా, చర్చ పూర్తికావాల్సిందేనంటూ స్పీకర్ రమేశ్ కుమార్ దృఢవైఖరి కనబర్చారు. ఈ నేపథ్యంలో, అధికార పక్ష సభ్యులు నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. సభను వాయిదా వేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ కూటమి సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు.
కాగా, ఇవాళ సభకు 205 మంది సభ్యులు హాజరుకాగా, బలపరీక్ష నిర్వహిస్తే విజయానికి 103 మంది మద్దతు అవసరం. రాజీనామా చేసిన 15 మందితో పాటు మరో నలుగురు సభ్యులు కూడా గైర్హాజరయ్యారు. మరోవైపు, కాంగ్రెస్ మాత్రం సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకు ఓటింగ్ నిర్వహించరాదని తన వైఖరిని సుస్పష్టంగా చాటుతోంది. ఓ దశలో సీఎం కుమారస్వామి తాజా పరిణామాలతో మనస్తాపం చెంది రాజీనామాకు సిద్ధపడగా, సభను ఎవరైనా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని స్పీకర్ రమేశ్ కుమార్ హెచ్చరించారు.