kumaraswamy: నేను బిర్యానీ మొత్తం తినలేదు.. రెండు మెతుకులు మాత్రమే తిన్నా: సభలో స్పష్టం చేసిన కుమారస్వామి
- మన్సూర్ ఖాన్‌తో సీఎం కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన బీజేపీ
- సభలో ప్రస్తావించిన బీజేపీ సభ్యుడు సీటీ రవి
- ఆరోపణలను కొట్టిపారేసిన ముఖ్యమంత్రి
ఐఎంఏ పోంజీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్‌తో కలిసి తాను బిర్యాన్నీ తిన్నట్టు బీజేపీ చేస్తున్న ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఖండించారు. ఆ ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదని కొట్టిపడేశారు. రంజాన్ సందర్భంగా తనను ఆహ్వానిస్తే వెళ్లిన మాట నిజమేనని, అయితే, బిర్యానీ మాత్రం ముట్టుకోలేదని స్పష్టం చేశారు. బాగుండదనే ఉద్దేశంతో రెండుమూడు మెతుకులు మాత్రం తీసుకున్నట్టు సభలో సీఎం వివరణ ఇచ్చారు.
కోట్లాది రూపాయల ఐఎంఏ కుంభకోణం కేసు నిందితుడు మన్సూర్ ఖాన్‌తో కలిసి కుమారస్వామి బిర్యానీ తింటున్నట్టున్న ఫొటోను కర్ణాటక బీజేపీ షేర్ చేసింది. విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీ నేత సీటీ రవి ఈ విషయాన్ని ప్రస్తావించారు. కోట్లాది రూపాయలు ముంచిన నిందితుడితో కలిసి సీఎం చెట్టాపట్టాలేసుకుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
ఆయన ఆరోపణలకు కుమారస్వామి బదులిచ్చారు. రంజాన్ సందర్భంగా తనను పిలిస్తే వెళ్లిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, బిర్యానీ మాత్రం ముట్టుకోలేదన్నారు. అనారోగ్య కారణాల వల్ల మాంసాహారాన్ని మానేసి చాలా రోజులైందన్నారు. ఆ రోజు రెండుమూడు మెతుకులు మాత్రం తీసుకుని తిన్నట్టు కుమారస్వామి వివరించారు.