Kumaraswamy: కుమారస్వామికి మరో షాక్... కాంగ్రెస్ కు మరో 8 మంది రాజీనామా!
- మరో మలుపు తిరిగిన కర్నాటకం
- ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా
- కుమారస్వామికి కొత్త తలనొప్పులు
కన్నడనాట నెలకొన్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండగా, మరో 8 మంది అదే దారిలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకూ 12 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, అనారోగ్యంతో ఉన్నానని, సభకు రాలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంతపాటిల్ చెప్పేశారు. దీంతో 16మంది బలనిరూపణకు దూరంగా ఉన్నట్టు కాగా, ఇప్పుడు మరో 8 మంది రిజైన్ యోచనలో ఉన్నట్టు వార్తలు రావడం కుమారస్వామికి కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టేదే.
ఇదిలావుండగా, ప్రస్తుతం రాజీనామా చేసిన 15 మందిలో అత్యధికంగా మైసూరు, బెంగళూరు ప్రాంతాలకు చెందినవారే. ఆ ప్రాంతంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఇక్కడ ఉప ఎన్నికలు జరిగితే విజయం సులువు కాదని భావించిన ఆ పార్టీ, తమకు బలమున్న ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన 8 మందితో రాజీనామాలు చేయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బలనిరూపణ ఇంకాస్త ఆలస్యమైతే వీరంతా రాజీనామా చేయడం ఖాయమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సమస్యలుంటే చర్చించుకుందామని గత రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమైన సిద్దరామయ్య, శివకుమార్ లు చెప్పినట్టు సమాచారం.