Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో యుద్ధం ముగించేందుకు వారం చాలు.. ప్రపంచపటం నుంచి ఆ దేశం కనుమరుగైపోతుంది: ట్రంప్
- కోటి మంది ప్రాణాలు పోకూడదని భావిస్తున్నాం
- ఆఫ్ఘనిస్థాన్ లో గత రెండు వారాల్లో ఎంతో పురోగతి సాధించాం
- పాక్ అందించిన సహకారం చాలా గొప్పది
తాము తలచుకుంటే ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాన్ని వారం రోజుల్లో ముగించేయగలమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రపంచపటం నుంచి ఆ దేశం కనుమరుగవుతుందని చెప్పారు. కోటి మంది ప్రాణాలు పోకూడదని తాము భావిస్తున్నామని తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో నిన్నటి భేటీ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
1990లలో తాలిబాన్లకు పాకిస్థాన్ పూర్తిగా సహకరించింది. పాక్ సహకారంతో ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు ఆక్రమించారు. 2001లో అమెరికా సహకారంతో తాలిబాన్ల అరాచక పాలన అంతమైంది. అప్పటి నుంచి తాలిబాన్లకు అమెరికా నేతృత్వంలోని బలగాలకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ లో గత రెండు వారాల్లో ఎంతో పురోగతి సాధించామని... దీనికి పాక్ అందించిన సహకారం చాలా గొప్పదని కితాబిచ్చారు. అమెరికాకు అనుకూలంగా ఎన్నో జరుగుతున్నాయని... మీ నాయకత్వంలో పాకిస్థాన్ కు కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నానని ఇమ్రాన్ తో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.