Donald Trump: ట్రంప్ వ్యాఖ్యలపై భారత రాయబారికి క్షమాపణలు చెప్పిన అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్
- కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్
- ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబడుతున్న అమెరికా కాంగ్రెస్ సభ్యులు
- ట్రంప్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ వ్యాఖ్య
కశ్మీర్ వివాదంపై అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ వ్యాఖ్యల పట్ల అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ కు ఆ దేశ సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు, అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ ఎలియట్ ఎల్ ఎంగెల్ వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియా-పాకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపుతాయని తెలిపారు.
మరో యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ కూడా హర్షవర్ధన్ కు క్షమాపణలు చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు అసమగ్రంగా, ఇబ్బందికరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై హర్షవర్ధన్ కు క్షమాపణ చెప్పానని తెలిపారు. కశ్మీర్ వివాదంలో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని ఇండియా అంగీకరించదనే విషయం దక్షిణాసియా విదేశాంగ విధానాలపై అవగాహన ఉన్న అందరికీ తెలుసని అన్నారు. భారత ప్రధాని మోదీ ఇలాంటి వాటిని అంగీకరించరని చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేసేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.