Andhra Pradesh: ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే సభ నుంచి సస్పెన్షనా?: టీడీపీ నేత కళా వెంకట్రావు
- టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం అన్యాయం
- ప్రజా వ్యతిరేక విధానాలను స్పీకర్ ప్రోత్సహించకూడదు
- సభ్యులను సస్పెండ్ చేయడం చేతగానితనానికి నిదర్శనం
ఏపీ శాసనసభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత కళావెంకట్రావు మండిపడ్డారు. తమ ముగ్గురు సభ్యులను అన్యాయంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. ఇచ్చినహామీలు నెరవేర్చమని అడిగితే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను స్పీకర్ ప్రోత్సహించకూడదని, సభ్యులను సస్పెండ్ చేయడం చేతగానితనానికి నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు జగన్ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తోందొకటని విమర్శించారు. టీడీపీపై బురదజల్లడమే జగన్ పనిగా పెట్టుకున్నారని, ఆయనలో అసహనం పెరిగిపోతోందని విమర్శించారు. సభను నడపాల్సింది స్పీకర్ అనీ, సీఎం కాదని ఆయన అన్నారు.