People For Animal: కుక్కను వదిలించుకున్న యజమాని.. కారణం తెలుసుకుని షాకైన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి
- నా కుక్కంటే నాకు చాలా ఇష్టం
- ఎలాంటి రోగాలూ లేవు
- ఎప్పుడూ ఎవ్వరికీ హాని తలపెట్టలేదన్న యజమాని
కేరళలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఓ కుక్కను యజమాని ఓ కూడలి వద్ద కట్టేసి వెళ్లిపోయాడు. ఆ కుక్క అదే పనిగా మొరుగుతుండటంతో స్థానికులు పీపుల్ ఫర్ యానిమల్స్ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి కుక్కను పరిశీలించగా దాని మెడలో ఒక ఉత్తరం లభించింది. దానిని చదివిన ఆ సంస్థ ప్రతినిధికి నోట మాట రాలేదు. సదరు కుక్క యజమాని ఆలోచించిన తీరుకి సంస్థ ప్రతినిధికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ లేఖలో తాను ఆ కుక్కను వదిలించుకోవడానికి గల కారణాలను సదరు యజమాని క్షుణ్ణంగా వివరించాడు. తన కుక్కంటే తనకు చాలా ఇష్టమని, దానికిప్పుడు మూడేళ్లని పేర్కొన్నాడు.
తన కుక్క చాలా మంచిదని, ఎలాంటి రోగాలూ లేవని ఎప్పుడూ ఎవ్వరికీ హాని తలపెట్టలేదని లేఖలో వెల్లడించాడు. తాను కూడా దానిని పాలు, గుడ్లు, బిస్కట్లు పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకున్నానని తెలిపాడు. అయితే ఆ కుక్కతో వచ్చిన చిక్కల్లా అది రోడ్డుపై తిరిగే వీధి కుక్కతో సంబంధం పెట్టుకోవడమేనని, అందుకే తాను దానిని వదిలించుకుంటున్నానని సదరు కుక్క యజమాని లేఖలో పేర్కొన్నాడు.
దానిని చదివిన పీఎఫ్ఏ సంస్థ ప్రతినిధి షాక్ అయ్యారు. తాను ఇలాంటి కేసును తొలిసారి చూస్తున్నానని, సాధారణంగా వైకల్యంతోనో, లేదంటే అనారోగ్యంతోనో బాధపడుతుంటే కుక్కలను వదిలించుకుంటారని, కానీ కుక్క సహజ లక్షణం ప్రదర్శించినందుకు వదిలించుకోవడం తొలిసారిగా చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఆ కుక్క పీఎఫ్ఏ సంరక్షణలో ఉంది.