Karnataka: కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి భావోద్వేగ ప్రసంగం.. సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం!
- ఈ పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా
- స్పీకర్, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా
- రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించా
కర్ణాటక సీఎం కుమారస్వామి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులపై సభలో కుమారస్వామి సుదీర్ఘ వివరణ ఇస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ ఎలా అస్థిరపరిచిందో కుమారస్వామి వివరించి చెబుతున్నారు. సంతోషంగా ఈ పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కావాలని చెప్పి ఈ విశ్వాసతీర్మానంపై చర్చను కొనసాగదీయలేదని, స్పీకర్, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
వ్యవసాయం నేపథ్యం ఉన్న తమ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిందని, ప్రజల కోసం కష్టపడి పని చేయడం తమకు తెలుసని అన్నారు. తాను ప్రభుత్వ కారు కూడా ఉపయోగించడం లేదని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయనని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించానని భావోద్వేగం చెందారు. కాగా, సంకీర్ణ ప్రభుత్వానికి తగిన బలం లేకపోవడంతో విశ్వాసపరీక్షకు దూరంగా ఉండే అవకాశాలున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. తన ప్రసంగం తర్వాత గవర్నర్ కు కుమారస్వామి రాజీనామా సమర్పిస్తారని ప్రచారం జరుగుతోంది.