Wasim Akram: వసీం అక్రమ్ కు మాంచెస్టర్ విమానాశ్రయంలో చేదు అనుభవం

  • మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ వాడుతున్న అక్రమ్
  • బ్యాగులో ఉన్న ఇన్సులిన్ సీసాలను చెత్తబుట్టలో వేసిన ఎయిర్ పోర్టు సిబ్బంది
  • ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసిన పాకిస్థాన్ పేస్ దిగ్గజం

క్రికెట్ చరిత్రలో వసీం అక్రమ్ వంటి ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు రాలేదనడం అతిశయోక్తి కాదు. తన స్వింగ్ తో హేమాహేమీలైన బ్యాట్స్ మన్లను సైతం హడలెత్తించిన ఘనత ఈ పాకిస్థాన్ పేస్ లెజెండ్ సొంతం. అయితే, ఈ దిగ్గజానికి మాంచెస్టర్ విమానాశ్రయంలో ఊహించని అనుభవం ఎదురైంది. వసీం అక్రమ్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు. ఎప్పుడూ ఇన్సులిన్ వెంట ఉండాల్సిందే. తరచుగా విదేశీ ప్రయాణాలు చేస్తుండే అక్రమ్ కు విమానాశ్రయాల్లో ఎప్పుడూ వ్యతిరేకత వ్యక్తంకాలేదు. కానీ, ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ సిటీ ఎయిర్ పోర్టులో మాత్రం అధికారులు అక్రమ్ ను నిలిపివేశారు.

అక్రమ్ బ్యాగ్ లో ఉన్న ఇన్సులిన్ సీసాలను బయటికి తీసి అందరి ముందు పట్టుకుని గట్టిగా ప్రశ్నించారు. అక్రమ్ వివరణను పట్టించుకోకుండా ఆ ఇన్సులిన్ సీసాలను చెత్తబుట్టలో వేశారు. ఇతర ప్రయాణికులు చూస్తుండగానే ఇదంతా జరిగిందని, తాను ఎంతో అవమానానికి గురయ్యానని అక్రమ్ ట్విట్టర్ లో బాధను వ్యక్తం చేశాడు.

అక్రమ్ ట్వీట్ పై స్పందించిన మాంచెస్టర్ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు, తమకు నేరుగా సందేశం పంపిస్తే ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకుంటామని పేర్కొనగా, ఇంత త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ అక్రమ్ బదులిచ్చారు.

  • Loading...

More Telugu News