star maa TV: బిగ్‌బాస్-3 వివాదం.. స్టార్ 'మా టీవీ'కి నోటీసులు ఇచ్చిన పోలీసులు
- బిగ్‌బాస్-3 చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు
- యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదుపై విచారణ ప్రారంభం
- ఆరు ప్రశ్నలతో చానల్‌కు నోటీసులు
స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్-3 చుట్టూ ఇటీవల వివాదాలు ముసురుకున్నాయి. షోను ఆపేయాలంటూ ఆందోళనలు జరిగాయి. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటుడు అక్కినేని నాగార్జున ఇంటి వద్ద ఇటీవల విద్యార్థి జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. షోను నిలిపివేయాలని నినాదాలు చేశారు. కాగా, బిగ్‌బాస్-3 పేరుతో తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ యాంకర్ శ్వేతారెడ్డి ఇటీవల చేసిన ఫిర్యాదుకు బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు.
ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా స్టార్ మా టీవీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల్లో చానల్ యాజమాన్యానికి ఆరు ప్రశ్నలు సంధించారు. అగ్రిమెంట్ వ్యవహారం, ఎంపిక విధానం, నిబంధనలు, శ్యాం, మిగిలిన ముగ్గురి పాత్రకు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. నోటీసులు అందుకున్న స్టార్ మా చానల్ సంస్థ అడ్మిన్ హెడ్ శ్రీధర్.. యాజమాన్యంతో మాట్లాడి రెండు రోజుల్లో సమాధానం ఇస్తామని పోలీసులకు తెలిపారు.