Karnataka: 'కర్నాటకం'లో కీలక పాత్ర పోషించిన ఆ 15 మంది పరిస్థితి ఏమిటి?
- రాజీనామాలు చేసిన 15 మంది
- వారిపై అనర్హత వేటు పడే అవకాశం
- ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటామంటున్న బీజేపీ
ఓ వైపు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు, మరోవైపు జేడీఎస్ రెబల్స్... మొత్తం 15 మంది కలిసి కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా కూలగొట్టారు. వారి వెనుక బీజేపీ నాయకుల ప్రమేయం ఉందని, ఒక్కొక్కరికీ ఆరు కోట్ల వరకూ ఇచ్చిన బీజేపీ పెద్దలు వారిని లోబరచుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రెబల్స్ వెనుక తమ ప్రమేయం లేదని కర్ణాటక బీజేపీ నేత, కాబోయే సీఎంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పే యడ్యూరప్ప వ్యాఖ్యానించినా, దాన్ని నమ్ముతున్న వారు మాత్రం ఎవరూ లేరనే చెప్పవచ్చు.
ఇక ఆ 15 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారంతా ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. అయితే, అవి ఇంకా ఆమోదం పొందలేదు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు జారీ చేసిన విప్ లకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు. వారిపై అనర్హత వేటు పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, వారు తమ ఎమ్మెల్యే హోదాను కోల్పోతారు. వారి నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. తిరిగి వారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటామని, ఒకసారి అధికారంలోకి వస్తే అంతా మన చేతిలోనే ఉంటుందని బీజేపీ నేతలు వారికి అభయం ఇచ్చినట్టు తెలుస్తోంది.