Karnataka: కర్ణాటక ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి!
- నిన్న సభకు హాజరు కాని బీఎస్పీ ఎమ్మెల్యే మహేశ్
- హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోందన్న మాయావతి
- సస్పెండ్ చేస్తూ ట్వీట్
తన ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించి, కర్ణాటక విశ్వాస పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయని ఎమ్మెల్యే మహేశ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. మహేశ్ వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.
"కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనాలనే బీఎస్పీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహేశ్ ప్రవర్తించారు. ఆయన మంగళవారం రోజున సభకు హాజరుకాలేదు. హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. తక్షణమే మహేశ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నా" అని మాయావతి పేర్కొన్నారు.
కాగా, సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి, మాయావతి కోరిక మేరకు తన మంత్రివర్గంలో మహేశ్ కు స్థానం కల్పించారు. అయితే, 2018 అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన, సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. నిన్న సభలో విశ్వాస పరీక్ష జరుగగా, కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే.