Rajnath Singh: మోదీ, ట్రంప్ సమావేశంలో కశ్మీర్ పై చర్చ జరగలేదు: రాజ్ నాథ్ సింగ్
- కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి భారత్ ఒప్పుకోదు
- దేశ ఆత్మాభిమానం విషయంలో రాజీపడే పసక్తే లేదు
- మోదీ, ట్రంప్ భేటీ అయిన సమయంలో జైశంకర్ అక్కడే ఉన్నారు
కశ్మీర్ వివాదం పరిష్కారానికి సంబంధించి ఎలాంటి మధ్యవర్తిత్వానికి భారత ప్రభుత్వం ఒప్పుకోదని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వం వహించాలంటూ భారత్ ప్రధాని మోదీ తనను కోరారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పార్లమెంటులో మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సమాధానం చెప్పకుండా ప్రధాని మౌనంగా ఉన్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం లోక్ సభలో రాజ్ నాథ్ మాట్లాడుతూ, మన దేశ ఆత్మాభిమానం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.
మోదీ నుంచి ట్రంప్ కు మధ్యవర్తిత్వం వహించాలన్న ప్రతిపాదన ఏదీ వెళ్లలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ నిన్న లోక్ సభలో తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజ్ నాథ్ మాట్లాడుతూ, జైశంకర్ చెప్పిన మాట నిజమేనని అన్నారు. మోదీ, ట్రంప్ భేటీ అయిన సమయంలో జైశంకర్ అక్కడే ఉన్నారని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.