Andhra Pradesh: ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ రుణ ఉపసంహరణలపై దుష్ప్రచారం జరుగుతోంది: ఏపీ ప్రభుత్వం
- కొత్త ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
- రాష్ట్రానికి రావాల్సిన రుణాల్లో పైసా కూడా ఎక్కడికీ పోదు
- మరింత రుణసాయం అందించేందుకు ముందుకొచ్చాయి
ఏపీ రాజధాని అమరావతికి ఇవ్వాల్సిన రుణాలను ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీలు ఉపసంహరించుకున్నట్టు వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీలు రుణాలను ఉపసంహరించుకున్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొంది.
రాష్ట్రానికి రావాల్సిన రుణాల్లో పైసా కూడా ఎక్కడికీ పోదని, ప్రతిపాదిత రుణాన్ని ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగించుకుంటామని, ఏపీకి మరింత రుణసాయం అందించేందుకు ఈ రెండు బ్యాంకులు ముందుకు వచ్చాయని స్పష్టం చేసింది. రుణాల ఉపసంహరణ విషయమై కొత్త ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది.
ఏపీలో 24 గంటల విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు 140 మిలియన్ డాలర్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణం కోసం 400 మిలియన్ డాలర్లను, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కోసం మరో 400 మిలియన్ డాలర్లు మంజూరు చేసినట్లు తమకు సమాచారం పంపిందని ప్రభుత్వం పేర్కొంది. ఏఐఐబీ బ్యాంకు ఉపాధ్యక్షుడిని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సంప్రదిస్తుందని తెలిపింది. ఏపీకి అన్ని రకాల సాయాన్ని కొనసాగించేందుకు ఏఐఐబీ సహకరిస్తుందని ఓ ప్రకటనలో తెలిపిన ప్రభుత్వం, అమరావతి ప్రాజెక్టులోని ఏడో ప్యాకేజ్ పనులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.