Indraganti Srikantsharma: సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కన్నుమూత!
- సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు తండ్రి
- ఆకాశవాణిలో పలు రకాల సేవలు
- సినీ గేయ రచయితగానూ గుర్తింపు
ప్రముఖ కవి, సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లో కన్ను మూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఈయన తండ్రి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి సుప్రసిద్ధ కవి. ఇక ప్రముఖ సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ వీరి తనయుడే. శ్రీకాంత్ శర్మ భార్య జానకీబాల ప్రముఖ సంగీతకారిణి.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో మే 29 ,1944న జన్మించిన ఆయన, తొలుత 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. ఆపై ఆకాశవాణి కేంద్రానికి విశేష సేవలందించారు. ఎన్నో లలిత గేయాలు, కవితలు, సాహిత్య వ్యాసాలను అందించారు. రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలను రచించి పేరు తెచ్చుకున్నారు. కృష్ణావతారం, నెలవంక, రావు- గోపాలరావు తదితర సినిమాలకు పాటలు రాశారు. ఇటీవల 'సమ్మోహనం' చిత్రంలో 'మనసైనదేదో...' అనే గీతాన్ని రాశారు. శ్రీకాంత శర్మ మృతి సాహిత్య లోకానికి తీరని లోటంటూ పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు.