Yedeyurappa: తనను కాదంటే జేడీఎస్ తో కలుస్తామని బీజేపీ పెద్దలకు యడ్యూరప్ప వార్నింగ్!
- నేడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
- ఇంకా అధిష్ఠానం నుంచి రాని గ్రీన్ సిగ్నల్
- అసహనంతో ఉన్న యడ్యూరప్ప
నేడు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు యడ్యూరప్ప ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ, బీజేపీ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంకా రాకపోవడంతో ఆయన చాలా అసహనంగా ఉన్నారు. నిన్న పార్టీ దూతగా ఆర్ అశోక్ ను హస్తినకు పంపించినా, ఏ మాత్రం హామీ ఇవ్వని అమిత్ షా, వేచి చూసే ధోరణిలోనే ఉండటం యడ్యూరప్పకు ఆగ్రహాన్ని తెప్పించింది. అధికారాన్ని హస్తగతం చేసుకునే వేళ, అధిష్ఠానం వైఖరి సరిగ్గా లేదంటూ, తన అనుచరుల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.
యడ్యూరప్పను కాదని, మరో వ్యక్తి పేరును అధిష్ఠానం సూచిస్తే, అంగీకరించేది లేదని మెజారిటీ బీజేపీ సభ్యులు పట్టు పట్టి ఉండటంతో బీజేపీ పెద్దలు ఈ విషయంలో ఆచితూచి అడుగేయాలనే భావిస్తున్నారు. కాగా, తనను కాదని మరొకరి పేరును తెరపైకి తెస్తే, తాము జేడీఎస్ తో కలిసేందుకు సిద్ధమన్న సంకేతాలను యడ్యూరప్ప పంపారని తెలుస్తోంది. యడ్యూరప్ప వైఖరిపై అమిత్ షా - మోదీ ద్వయం సైతం సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం. దీంతో గడచిన పక్షం రోజులుగా సాగుతున్న కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.