Nalini: పెరోల్ పై విడుదలైన రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి నళిని
- కుమార్తె వివాహం నిమిత్తం నెల రోజుల పెరోల్
- ఇటీవలే మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు
- నళినిని రిసీవ్ చేసుకున్న తల్లి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఈ ఉదయం వేలూరు జైలు నుంచి పెరోల్ పై విడుదలైంది. తన కుమార్తె హరిత వివాహ నిమిత్తం ఆరు నెలల పెరోల్ కావాలని ఆమె కోరగా, మద్రాస్ హైకోర్టు నెల రోజుల పెరోల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన నళినిని ఆమె తల్లి రిసీవ్ చేసుకుంది. యూకేలో మెడిసిన్ చదివిన హరిత, మరో వారంలో ఇండియాకు తిరిగిరానుంది.
కాగా, ఈ నెల రోజులూ నళిని వేలూరు పట్టణాన్ని దాటి బయటకు వెళ్లేందుకు వీలు లేదని హైకోర్టు నిబంధన విధించింది. ఆమె ఏ రాజకీయ నాయకుడితోనూ, మీడియాతోనూ మాట్లాడకూడదని కూడా కండిషన్ పెట్టింది.
అంతకుముందు ఈ నెలారంభంలో తనకు పెరోల్ కావాలంటూ కోర్టులో తన వాదనను వినిపించిన ఆమె, రాజీవ్ హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించి శిక్షించారని వాపోయింది.
"నా కుమార్తె బాగోగులను ఓ తల్లిగా నేను చూసుకోలేక పోయాను. నా తండ్రి చనిపోయేముందు ఆయన కోరికలను తీర్చలేకపోయాను. నా కుమార్తె పెళ్లి నిశ్చయమైంది. డబ్బులు కూడబెట్టుకోవాలి" అంటూ భావోద్వేగంతో నళిని కోర్టులో చేసిన వ్యాఖ్యలు ఆమెకు పెరోల్ లభించేలా చేశాయి. గత సంవత్సరం నళిని తండ్రి శంకర నారాయణన్ మరణించిన సమయంలోనూ ఆమెకు ఒక రోజు పెరోల్ లభించిన సంగతి తెలిసిందే.
రాజీవ్ హత్య తరువాత నళినిని పోలీసులు అరెస్ట్ చేయగా, 28 సంవత్సరాల నుంచి ఆమె జైలు జీవితాన్ని అనుభవిస్తోంది. ఆమె భర్త మురుగన్ కూడా ఇదే కేసులో వేలూరు స్పెషల్ జైలులో భార్యతో పాటే శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ కేసులో వీరికి తొలుత మరణశిక్ష విధించినప్పటికీ, దాన్ని జీవితఖైదుగా మార్చిన సంగతి తెలిసిందే.