Telangana: బిగ్ బాస్-3 కాంట్రావర్సీపై స్పందించిన హీరో అక్కినేని నాగార్జున!
- బిగ్ బాస్-3కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున
- షోను చుట్టుముట్టిన క్యాస్టింగ్ కౌచ్ వివాదం
- గాల్లోంచి కూడా కాంట్రావర్సీలు పుడతాయన్న నాగ్
బిగ్ బాస్-3 రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం చేసేటప్పుడు ఒకే చోట బిగుసుకుని కూర్చోవాల్సి వచ్చేదన్నారు. కానీ బిగ్ బాస్-3 షోలో మాత్రం అటూఇటూ తిరిగేందుకు స్వేచ్ఛ ఉందని అన్నారు. బిగ్ బాస్-3 ఇప్పటికి ఒక వారమే అయిందని చెప్పారు. ఈ సందర్భంగా బిగ్ బాస్-3 కేంద్రంగా చెలరేగిన క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై నాగార్జున పెదవి విప్పారు.
‘నాకు తెలిసి బిగ్ బాస్ కార్యక్రమం 15 లేదా అంతకంటే ఎక్కువ దేశాల్లో నడుస్తోంది. వేర్వేరు భాషల్లో పలు సీజన్లలో విజయవంతంగా నడుస్తోంది. కాంట్రావర్సీలను గాలి నుంచి కూడా పుట్టించవచ్చు. తెలంగాణ పోలీసులు, హైకోర్టు ఈ విషయాన్ని పట్టించుకోవడంపై నేను సంతోషంగా ఉన్నా. ఈ విషయంలో నిజంగా తప్పు జరిగితే దోషులను కఠినంగా శిక్షించాలి’ అన్నారు నాగార్జున.
బిగ్ బాస్-3 తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా పట్టాలెక్కుతుందని నాగార్జున చెప్పారు. బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరో చివరి 5 నిమిషాల వరకూ తనకు తెలియదని నాగ్ స్పష్టం చేశారు.