Andhra Pradesh: జగన్ ఇచ్చిన వరమని సంబరపడిపోతే సరిపోదు!: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న ట్వీట్
- మా హయాంలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు ధర రూ.2కు తగ్గించాం
- ఎక్కువ వసూలు చేశామని విజయసాయిరెడ్డి వ్యాఖ్య!
- ఈసారి కూడా ఆయన పచ్చి అబద్ధాలే ఆడారు
ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా చేసిన ట్వీట్ లో విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు ధరను రూ.4.63 నుంచి రూ.2కు తగ్గించామని, విజయసాయిరెడ్డి ఏమో రూ.3.86 వసూలు చేసే వాళ్లమంటూ అబద్ధం ఆడేశారని, ఆయన నోటి నుంచి పొరపాటునైనా నిజాలు వస్తాయేమో అని అనుకుంటే ఈసారి కూడా పచ్చి అబద్ధాలే ఆడారని వ్యాఖ్యానించారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు ధరను రూ.2కు తగ్గించింది కనుకనే వైసీపీ ప్రభుత్వం ఆ ధరను రూ.1.50 చేసిందని అన్నారు. అయినా, ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుని ‘ఇది జగన్ గారు ఇచ్చిన వరం అని మీరు సంబరపడిపోతే సరిపోదు. అక్కడ కరెంటు లేక అవస్థలు పడుతున్న రైతులు ఇదెక్కడి శాపం’ అని అనుకుంటున్నారని విమర్శించారు.