mp: అయితే ‘మీ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలని ఉంది..’: ప్యానెల్ స్పీకర్ రమాదేవితో ఎంపీ ఆజంఖాన్
- లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు పై చర్చ
- అటూ ఇటూ కాదు నా వైపు చూస్తూ మాట్లాడండి: ప్యానెల్ స్పీకర్
- కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడితే మీరే నన్ను తప్పుకోమని చెబుతారు: ఆజంఖాన్
లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆజం ఖాన్ ‘అటూ ఇటూ చూసి కాకుండా’ తన వైపు చూస్తూ మాట్లాడాలని ప్యానెల్ స్పీకర్ రమాదేవి ఆదేశించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ‘మీ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలని ఉందని, అలా చేస్తే మీరే నన్ను తప్పుకోమని చెబుతారని’ అన్నారు.
దీంతో, ‘మాట్లాడాల్సిన విధానం ఇది కాదని’ రమాదేవి వ్యాఖ్యానించగా, ఆజంఖాన్ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ‘మీరు నాకు సోదరితో సమానం’ అని ఆజంఖాన్ చెప్పడం గమనార్హం. అనంతరం, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఆజంఖాన్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పులేదని, ఆ వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యలకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు.