Manda Krishna: అసెంబ్లీలో ఏం మాట్లాడినా జగన్ చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు: మంద కృష్ణ ధ్వజం
- పాదయాత్ర చేస్తామంటే ఒప్పుకోవట్లేదు
- వైఎస్ వర్గీకరణకు మద్దతు ఇచ్చారు
- 2010లో ప్రధానికి జగన్ లేఖ రాశారు
3600 కిలో మీటర్లు పాదయాత్ర చేసినట్టు చెప్పుకునే ఏపీ సీఎం జగన్, తాము 36 కిలో మీటర్లు పాదయాత్ర చేస్తామంటే ఎందుకు అనుమతించట్లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో ఏం మాట్లాడినా చెల్లుతుందని జగన్ భావిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ వర్గీకరణకు మద్దతు ఇచ్చారని, అలాగే జగన్ కూడా 2010లో ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని మంద కృష్ణ గుర్తు చేశారు.
మాట తప్పను, మడమ తిప్పనన్న జగన్ ఎస్సీ వర్గీకరణపై మాట మార్చడాన్ని తప్పుబట్టారు. నందిగం సురేష్ రాసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తమపై నిర్బంధం ఎందుకో అర్థం కావడం లేదన్న మంద కృష్ణ, జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. ప్రభుత్వ కుట్రలను ఛేదించుకుని అసెంబ్లీ ఎదుట ఆందోళన చేస్తామన్నారు. జాతి కోసమే బీజేపీతో స్నేహమని, ఆ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదని మంద కృష్ణ స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి వర్గీకరణ విషయంలో కాస్త సానుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.