TFDT: దర్శకుడు రాఘవేంద్రరావు ట్రస్ట్‌కు రాజమౌళి భారీ విరాళం
- మే 4న ట్రస్ట్‌ను ప్రకటించిన రాఘవేంద్రరావు
- ఈ నెల 24న రిజిస్టర్ చేయించినట్టు చెప్పిన దర్శకుడు
- రూ.50 లక్షల విరాళం అందించిన రాజమౌళి
తెలుగు చిత్ర పరిశ్రమలోని దర్శకుల సంక్షేమం కోసం దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఏర్పాటు చేసిన ‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ (టీఎఫ్‌డీటీ) కు మరో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూ.50 లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. చిత్రపరిశ్రమలోని అందరి సహకారంతో ట్రస్ట్‌ను ఈ నెల 24న రిజిస్టర్ చేసినట్టు తెలిపారు.
తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవమైన మే 4న రాఘవేంద్రరావు టీఎఫ్డీటీని ప్రకటించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి రూ.25 లక్షలు ప్రకటించారు. రాఘవేంద్రరావు రూ.10 లక్షలు, ఆర్కే మీడియా సంస్థ రూ. 15 లక్షలు ప్రకటించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక భారీ నిధిని ఏర్పాటు చేసి, దాని వడ్డీ ద్వారా కష్టాల్లో వున్న దర్శకుల కుటుంబాలకు సహాయం చేయాలనేది ముఖ్యోద్దేశం.
కాగా, ఈ ట్రస్ట్‌కు కె. రాఘవేంద్రరావు చైర్మన్‌గా, మేనేజింగ్ ట్రస్టీగా ఎన్. శంకర్, ట్రస్టీలుగా వి.వి.వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్రసాద్, కాశీ, బి.వి.ఎస్.రవి, ట్రెజరర్ గా మెహర్ రమేశ్ వ్యవహరిస్తున్నారు.