Nalini: వేలూరులో నళినికి హారతులతో స్వాగతం!
- నిన్న జైలు నుంచి విడుదలైన నళిని
- అద్దె ఇల్లు ఇచ్చిన తమిళ పెరవై సంయుక్త కార్యదర్శి
- నెల రోజుల పాటు అక్కడే మకాం
- వివాహ తేదీ నిశ్చయం కాగానే మురుగన్ పెరోల్ కోరే అవకాశం
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో 28 సంవత్సరాల నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న నళినికి తన కుమార్తె వివాహం నిమిత్తం, నిన్న పెరోల్ మంజూరుకాగా, బాహ్యప్రపంచంలోకి వచ్చిన ఆమెకు బంధువులు ఆనంద బాష్పాల మధ్య హారతులు పడుతూ స్వాగతం పలికారు.
తన తల్లి పద్మ, కాట్పాడి బ్రహ్మపురానికి చెందిన మహిళ జామీనుతో జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె వేలూరు, రంగాపురంలోని పులవర్ నగర్ లో ద్రావిడ సిద్ధాంతాలకు చెందిన తమిళ పేరవై రాష్ట్ర జాయింట్ కార్యదర్శి సింగరాయర్ ఇంట్లో ఉంటూ, కుమార్తె వివాహాన్ని జరిపించనున్నారు. నళిని వచ్చే సమయానికే ఆ ఇంటికి చేరుకున్న పద్మ, ఇతర బంధువులు ఆమెకు హారతులు పట్టి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇక ఆమె భర్త మురుగన్ ఇంతవరకూ పెరోల్ కోరలేదు. పెళ్లి నిశ్చయమైన తరువాత, కుమార్తె వివాహాన్ని జరిపించేందుకు ఆయన పెరోల్ కోరవచ్చని తెలుస్తోంది. ఇదిలావుండగా, నళిని కుమార్తె హరిద్ర ఇంకా వేలూరుకు రాలేదు. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఆమె మరో వారంలో వేలూరుకు రావచ్చని తెలుస్తోంది. నళిని వేలూరును వదిలి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, వివాహం కూడా వేలూరులోనే జరుగుతుందని సమాచారం.