Vijayawada: గూడూరు - విజయవాడ మధ్య కొత్త ఇంటర్ సిటీ... నాలుగున్నర గంటల ప్రయాణం!
- బస్ లో వెళ్లాలంటే ఆరు గంటలకు పైగా సమయం
- వెంకయ్యనాయుడి చొరవతో కొత్త రైల్
- అతి త్వరలో ప్రారంభమయ్యే చాన్స్
విజయవాడ నుంచి గూడూరుకు వెళ్లాలంటే బస్సులో ఆరు గంటలకు పైగా సమయం పడుతుంది. రైలులో వెళితే త్వరగా చేరుకోవచ్చుగానీ, దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఈ రెండు ప్రాంతాల మధ్యా ఆగే స్టేషన్లు చాలా తక్కువ. బాపట్ల తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు వంటి పట్టణాలు ఈ రూట్ లో ఉండగా, అన్ని ముఖ్య స్టేషన్లలో ఆగే రైళ్లు సమయానుకూలంగా లేవన్న విమర్శలు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రైల్వే శాఖకు చేసిన విజ్ఞప్తితో అధికారులు విజయవాడ - గూడూరు మధ్య సరికొత్త ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను ప్రకటించారు. ఈ రైలు కేవలం నాలుగున్నర గంటల వ్యవధిలో తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.
గూడూరు నుంచి ఉదయం 6.10 గంటలకు (12743) బయలుదేరే రైలు, నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి మీదుగా ఉదయం 10.40కి విజయవాడకు చేరుతుంది. ఇదే రైలు విజయవాడ నుంచి (12744) సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గూడూరుకు వెళుతుంది. ఈ రైలు రేక్ ని నిర్వహించే బాధ్యత విజయవాడ డివిజన్ కు అప్పగించారు. ఈ రైలును ప్రారంభించేందుకు స్వయంగా వెంకయ్యనాయుడు వస్తారని తెలుస్తోంది.