Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు... అనూహ్యంగా పెరిగిన రద్దీ!
- వారాంతానికి ముందే రద్దీ
- నిండిపోయిన కంపార్టుమెంట్లు
- బయట కిలోమీటర్ వరకూ క్యూలైన్
సప్తగిరులపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వారాంతం సమీపించడంతో శుక్రవారం తెల్లారేసరికే వైకుంఠంలోని రెండు క్యూ కాంప్లెక్స్ ల్లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి, వెలుపల కిలోమీటర్ కు పైగా క్యూలైన్ నిలిచిపోయింది. తెల్లవారుజామునే కంపార్టుమెంట్లలోకి వెళ్లాలని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఉదయం 7 గంటల సమయంలో క్యూలైన్లలోకి ప్రవేశిస్తే, రేపు ఉదయం 8 గంటల తరువాతనే స్వామి వారి దర్శనం కలుగుతుందని, భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు పీఏ సిస్టమ్స్ ద్వారా అనౌన్స్ చేశారు.
కాగా, శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. నిన్న గురువారం నాడు స్వామిని 72,219 మంది భక్తులు దర్శించుకున్నారని, 30,758 మంది తలనీలాలను సమర్పించారని, హుండీ ఆదాయం రూ. 3.11 కోట్లని తెలియజేశారు. కాగా, ప్రస్తుతం క్యూ లైన్లలో ఉన్నవారికి అన్న పానీయాలను సమకూర్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని, వారికి అల్పాహారం, పాలు, మజ్జిగ, ఉప్మా, సాంబార్ అన్నం తదితరాలను అందించనున్నామని వెల్లడించారు.