Andhra Pradesh: కేశినేని నానికి కొత్త తలనొప్పి.. వేతన బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల ఆందోళన!
- విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద నిరసన
- 8 నెలల జీతాలు ఇవ్వలేదన్న ఉద్యోగులు
- న్యాయం చేయకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వార్నింగ్
పలు వివాదాలు రావడంతో టీడీపీ నేత కేశినేని నాని ‘కేశినేని ట్రావెల్స్’ వ్యాపారాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే తమకు వేతనాలు ఇవ్వకుండానే ఆయన కంపెనీని మూసేశారని ఉద్యోగులు అప్పట్లో ఆందోళన చేశారు. తాజాగా మరోసారి కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఈరోజు విజయవాడలోని లెనిన్ సెంటర్ లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా శంకర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. కేశినేని సంస్థ తమకు 8 నెలల జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై లేబర్ కోర్టుకు వెళ్లినా కోర్టును మేనేజ్ చేశారని వాపోయాడు. తమలో కొందరు ఉద్యోగులను ఆఫీసుకు పిలిపించిన నాని టీడీపీ కార్యకర్తలతో కొట్టించారని ఆరోపించారు. మూడేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదన్నారు. తమకు న్యాయం చేయకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.