Andhra Pradesh: సాంకేతికతతో ప్రయోజనాలతో పాటు అనర్థాలూ ఉన్నాయి: ఏపీ హోం మంత్రి సుచరిత
- ‘సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ’పై సదస్సు
- సదస్సులో పాల్గొన్న సుచరిత, మంత్రులు, డీజీపీ
- ఫిర్యాదుల కోసం ‘సైబర్ మిత్ర’ పేరిట ఫేస్ బుక్ పేజీ ఏర్పాటు
సాంకేతికతతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అంతే అనర్థాలు కూడా ఉన్నాయని ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. ‘సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ’ అనే అంశంపై సచివాలయంలో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సదస్సులో పలువురు మంత్రులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ, సైబర్ నేరాలకు గురైన మహిళలు, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా కుంగిపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు రోజురోజుకీ పెరుగుతున్నాయని అన్నారు. సైబర్ నేరాల బారిన మహిళలు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని మహిళలందరికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. పోలీస్ స్టేషన్లకు రాకుండానే న్యాయం జరిగేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ఫిర్యాదుల కోసం ‘సైబర్ మిత్ర’ పేరిట ఫేస్ బుక్ పేజీ, ‘వాట్సప్’ నంబర్లు ఏర్పాటు చేశారు. ‘వాట్సప్’లో ఫిర్యాదు చేసేందుకు9121211100 నంబర్ ను కేటాయించారు.