Vizag: గోదావరి జలాల పంపకం రెండు రాష్ట్రాల సీఎంల నిర్ణయంగా చూడొద్దు: బీజేపీ నేత పురందేశ్వరి
- ప్రజలు, రైతు సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి
- ‘హోదా’పై ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారు
- పీపీఏల రద్దు నిర్ణయం కరెక్టు కాదు
గోదావరి నదీ జలాల పంపకం విషయాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయంగా చూడొద్దని, ప్రజలు, రైతు సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ నేత పురందేశ్వరి సూచించారు. కార్గిల్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, నదీ జలాల పంపకం విషయమై రైతులను, రైతు సమాఖ్యలను, అఖిలపక్షం విశ్వాసాన్ని తీసుకుని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరమైతే ఉందని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు చేసినప్పటికీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరిగితే సమీక్షించ వచ్చు కానీ, వాటిని రద్దు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. ఏపీలో గత ప్రభుత్వ పాలనను భరించలేక ప్రజలు వైసీపీకి అధికారమిచ్చారని, అయితే, ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతోందని విమర్శించారు. ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు.