Ration: తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకున్న ఏపీ వాసులు.. విజయవంతమైన రేషన్ పోర్టబులిటీ
- రేషన్ తీసుకున్న విశాఖపట్టణం, రాజమండ్రి వాసులు
- ఆగస్టు ఒకటి నుంచి అమలు
- హర్షం వ్యక్తం చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్
తెలంగాణలో రేషన్ పోర్టబులిటీ విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ వాసులు శుక్రవారం తెలంగాణలో రేషన్ కార్డులు తీసుకున్నారు. ఒకే దేశం-ఒకే కార్డు విధానాన్ని వచ్చే ఏడాది జూన్‌లోగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానం తెలంగాణ, ఏపీల్లో అమల్లో ఉంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలతోపాటు గుజరాత్, మహారాష్ట్రలను రెండు క్లస్టర్లగా ఏర్పాటు చేసి ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. ట్రయల్ రన్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ రేషన్ దుకాణంలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, విశాఖపట్టణం జిల్లా యలమంచిలికి చెందిన ఇద్దరు వ్యక్తులు విజయవంతంగా రేషన్ సరుకులు తీసుకున్నారు.
ట్రయల్ రన్ విజయవంతం కావడంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ పోర్టబులిటీని గతేడాది ఏప్రిల్ నుంచే అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వలసదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.