Crime News: డబ్బుకోసం తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకు
- కొడుకే కాలయముడవుతాడని ఊహించని వృద్ధ దంపతులు
- నిద్రమాత్రలిచ్చి, అనంతరం, గొంతునులిమి, కత్తిపీటతో పీక కోసి...
- అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
మానవత్వానికే మాయని మచ్చ ఈ ఘటన. కన్న తల్లిదండ్రులను డబ్బు కోసం హత్య చేశాడో కొడుకు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణం అద్దంకి రోడ్డులోని దేసువారి వీధిలో ఈనెల 21న అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వృద్ధ దంపతుల మృతి వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. కొడుకే కాలయముడని గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి.
దర్శి పట్టణానికి చెందిన అన్నపురెడ్డి వెంకటరెడ్డి, ఆదెమ్మ దంపతులు. వీరి కొడుకు అన్నపురెడ్డి నారాయణరెడ్డి. వ్యసనాలకు బానిసైన నారాయణరెడ్డి అప్పులపాయ్యాడు. అప్పులు తీర్చమని తల్లిదండ్రులను వేధిస్తుంటే కూలి పనులు చేస్తూ కొన్ని అప్పులు తీర్చారు. అయినా అతనిలో మార్పురాలేదు. భార్యను కూడా వేధిస్తుండంతో ఏడాదిన్నర క్రితమే పిల్లల్ని తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
వ్యసనాలకు మరింత బానిసై తాను పనిచేస్తున్న సంస్థ డబ్బు కూడా రూ.3 లక్షలు వాడేశాడు. ఈ విషయం తెలిసిన యాజమాన్యం డబ్బు కోసం ఒత్తిడి తెచ్చింది. విషయం తల్లిదండ్రులకు చెబితే వారు డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముందస్తు ప్రణాళికలో భాగంగా మూడు నెలల క్రితం తల్లి పేరున 15 లక్షల రూపాయలకు బీమా పాలసీ చేసి నామినీగా తన పేరు పెట్టుకున్నాడు.
ఈనెల 21వ తేదీ రాత్రి భోజనానంతరం తల్లిదండ్రులు తాగే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపాడు. అనంతరం ఇంటి వెనుక ఉన్న గదిలో పడుకునేందుకు తల్లిదండ్రులు వెళ్లిపోయారు. నిద్రమాత్రల ప్రభావంతో వారు చనిపోతారని నారాయణరెడ్డి ఊహించాడు. కానీ ఎప్పటికీ చనిపోక పోవడంతో తొలుత తల్లి నోట్లో గుడ్డలు కుక్కి పీకనులిమి చంపేశాడు. ఆ తర్వాత తండ్రినీ అలాగే చేయాలనుకున్నా వీలుకాలేదు. దీంతో కత్తిపీటతో అతని మెడ, మణికట్టు కోసేసి హత్య చేశాడు.
ఉదయం ఏమీ తెలియనట్టు తల్లిదండ్రుల గది వద్దకు వెళ్లి తలుపుకొట్టాడు. లేవడం లేదంటూ కిటికీ లోనుంచి చూశాడు. స్థానికులకు విషయం చెప్పి హడావుడి చేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలి నుంచి నారాయణరెడ్డి వ్యవహారశైలిని అనుమానిస్తున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో కొడుకే కాలయముడని గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.