Andhra Pradesh: టీడీపీ నిజనిర్ధారణ కమిటీకి షాక్.. పొనుగోడు పొలిమేరల్లోనే అడ్డుకున్న పోలీసులు!
- టీడీపీ నేతలను ఊర్లోకి అనుమతించమన్న పోలీసులు
- శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని వ్యాఖ్య
- ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్న టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొనుగోడు గ్రామం వద్ద టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలోకి టీడీపీ నేతలు వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని, అందుకే అడ్డుకుంటున్నామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు ఊర్లోకి వెళ్లేందుకు తాము అనుమతించలేమని తేల్చిచెప్పారు. పొనుగోడులో టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా వైసీపీ నేతలు గొడ కట్టారు. ఈ విషయమై బాధితులు ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించడంతో దాన్ని ఆపేశారు.
ఈ విషయమై మీడియాలో కథనాలు రావడంతో నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్, అశోక్ బాబు, శమంతకమణిలతో టీడీపీ అధినేత చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీని నియమించారు. తాజగా ఈ కమిటీ సభ్యులనే పోలీసులు ఊర్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే పోలీసుల సమక్షంలోనే తాము గ్రామంలో పర్యటిస్తామనీ, ఎలాంటి శాంతిభధ్రతల సమస్య తలెత్తదని టీడీపీ నేతలు వారికి హామీ ఇచ్చారు. అయినా పోలీసులు మెత్తబడకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు.