Andhra Pradesh: ఇసుక విధానంపై జగన్ రెండు అడుగులు ముందుకు-నాలుగు అడుగులు వెనక్కు వేస్తున్నారు!: కన్నా లక్ష్మీనారాయణ
- వైసీపీ సర్కారుపై కన్నా ఆగ్రహం
- ఏపీలో విత్తనాల కొరత పరిష్కరించాలని డిమాండ్
- కరవు నివారణ చర్యలు చేపట్టాలని సూచన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు వచ్చి 2 నెలలు కాకముందే వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ దాడిని ముమ్మరం చేసింది. ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం తీవ్రమైన విత్తనాల కొరత నెలకొందనీ, ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు డిమాండ్ చేశారు. ఏపీలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, కరవు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో కరవు నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఇక నూతన ఇసుక పాలసీ విషయంలో సీఎం జగన్ ‘రెండు అడుగులు ముందుకు-నాలుగు అడుగులు వెనక్కు’ వేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు, అపవిత్ర పొత్తు కారణంగానే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందని స్పష్టం చేశారు. ఇందులో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు.